చెట్టును ఢీకొన్న కారు
● డ్రైవర్ దుర్మరణం
గుర్రంపోడు : కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండల కేంద్రం సమీపంలోని శాంతినగర్ వద్ద ఆదివారం జరిగింది. ఎస్‌ఐ డి. రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పంబాల శ్రీనివాస్(30) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం గుర్రంపోడు మండలంలోని చేపూరు గ్రామంలో తన బంధువుల ఇంటికి కారులో వస్తుండగా.. శాంతినగర్ వద్ద కారు అదుపుతప్పడంతో చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తండ్రి పంబాల పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


