రాజేష్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారించాలి
హుజూర్‌నగర్ : కర్ల రాజేష్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ మృతి కేవలం పోలీసుల అక్రమ నిర్బంధం వల్లే జరిగిందని ఆరోపించారు. రాజేష్ మృతికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని జ్యుడీషియల్ ఎంకై ్వరీ జరిపించాలన్నారు. ఈ విషయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గతంలో మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు పోలీసుల అక్రమాలకు వ్యతిరేకంగా ఉత్తమ్‌తో కలిసి పోరాడామని, గవర్నర్, సీఎంకు లేఖలు కూడా రాశామని గుర్తు చేశారు. రాజేష్ మృతికి కారణమైన ప్రధాన నిందితుడు ఎస్‌ఐ సురేష్‌రెడ్డిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సీఐని వెంటనే సస్పెండ్ చేసిన అధికారులు, ఎస్‌ఐ సురేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కూడా ఈ ఘటనపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో శానంపూడి సైదిరెడ్డి, బొబ్బ భాగ్యరెడ్డి, జక్కుల నాగేశ్వరావు, బెల్లంకొండ అమర్ గౌడ్, ధనుంజయ నాయుడు, పి. వెంకట్ రెడ్డి, మురళి, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు బి. వెంకటేశ్వర్లు, ఎ. రాజు, బి. ప్రసాద్, నాగరాజు, నాగయ్య, ఆర్. వెంకటేశ్వర్లు, ఒగ్గు విశాఖ, బాలచంద్రుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణమాదిగ


