భూతగాదాలో ఘర్షణ.. వృద్ధురాలు మృతి
● శాలిగౌరారం మండలం
రామాంజాపురం గ్రామంలో ఘటన
శాలిగౌరారం : భూతగాదాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన శాలిగౌరారం మండలం రామాంజాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాంజాపురం గ్రామానికి చెందిన దండంపల్లి ముత్తమ్మ(65), ఆమె తోటి కోడలు దండంపల్లి సైదమ్మకు అదే గ్రామానికి చెందిన జటంగి యాదమ్మ మధ్య కొంతకాలంగా భూతగాదాలు జరుగుతున్నాయి. ముత్తమ్మ, సైదమ్మకు గ్రామంలోని సర్వే నంబర్ 168/ఏ లో 2.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెవెన్యూ రికార్డు ప్రకారం ముత్తమ్మ పేరున 1.30 ఎకరాలు, సైదమ్మ పేరున 0.29 గుంటల భూమి ఉంది. ఈ భూమిలో తమకు 0.30 గుంటల భూమి ఉందంటూ జటంగి యాదమ్మ కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ముత్తమ్మ, సైదమ్మ నకిరేకల్‌లోని సివిల్ కోర్టును ఆశ్రయించడంతో స్టేటస్‌కో ఆర్డర్ ఇచ్చింది.
జేసీబీతో కంపచెట్లు తొలగిస్తుండగా..
దీంతో వారి కుటుంబ సభ్యులు ఆదివారం భూమిలో ఉన్న కంపచెట్లను జేసీబీతో తొలగిస్తుండగా.. విషయం తెలుసుకున్న జటంగి యాదమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులు వెళ్లి జేసిబీని అడ్డుకోబోయారు. ముత్తమ్మ కుమారుడు రామనర్సయ్య జేసీబీ వద్దకు వెళ్లగా.. యాదమ్మ కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేయబోయారు. దీంతో ముత్తమ్మ అడ్డుకోబోయింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ముత్తమ్మ కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ముత్తమ్మను నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైధ్యులు నిర్ధారించారు. మృతురాలి కుమారుడు రామనర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అడిగేందుకు ఎస్‌ఐని ఫోన్‌లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.


