రౌడీ షీటర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం మైలార్‌గూడెం గ్రామ సమీపంలోని హరిహర కాటేజీలో శుక్రవారం జరిగిన రౌడీ షీటర్ ఠాకూర్ నిశాంత్‌సింగ్ హత్య కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం పట్టుకున్నట్లు యాదగిరిగుట్ట సీఐ బి. భాస్కర్ తెలిపారు. మృతుడి అక్క ఫిర్యాదు మేరకు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన యాదగిరిగుట్ట పోలీసులు ఆదివారం పట్టణ పరిధిలోని సన్నిధి హోటల్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా.. నిశాంత్‌సింగ్‌ను హత్య చేసి పారిపోయిన యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వనగంటి ఉపేందర్, ఆకుల బాలమల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి బెల్లంకొండ సాయికుమార్‌ను మైలార్‌గూడెం గ్రామంలో అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య కేసులో ఉన్న మరికొంత మంది పరారీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుల నుంచి స్కూటీ, రెండు కత్తులు, రెండు స్మార్ట్‌ఫోన్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


