హోమంతలపల్లి, చింతపల్లిలో స్వల్ప ఉద్రిక్తత
మర్రిగూడ(చింతపల్లి) : చింతపల్లి మండల కేంద్రంతో పాటు హోమంతలపల్లిలో బుధవారం సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవం కావడంతో ఆ గ్రామానికి చెందిన కొందరు పక్కనే ఉన్న హోమంతలపల్లికి వచ్చి ఓ పార్టీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేస్తుండడంతో గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మల్లారెడ్డిపల్లి గ్రామస్తులను అక్కడి నుంచి పంపించేశారు. అదేవిధంగా చింతపల్లి మండల కేంద్రంలో ఓ వ్యక్తి పోలీస్ సిబ్బందితో దురుసుగా మాట్లాడడంతో ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసు వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. సదరు వ్యక్తిని పోలీసులు గ్రామ శివారులోకి తీసుకెళ్లి పోలింగ్‌కు ఎలాంటి ఆటంకాలు కల్గించొద్దని సర్ది చెప్పినట్లు సమాచారం.


