రామానుజ కూటంలో ప్రసాద తయారీకి స్వస్తి
ఫ సరైన సిబ్బంది, మిషనరీ లేక ప్రసాద విభాగంలో
తయారు చేయిస్తున్న యాదగిరిగుట్ట ఆలయ అధికారులు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని భక్తులు దర్శించుకొని బయటకు వెళ్లే సమయంలో పశ్చిమ రాజగోపుర ద్వారం చెంత వారికి ఉచితంగా పులిహోర ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది అందజేస్తున్నారు. ఈ ప్రసాదాన్ని రామానుజ కూటంలో ఎంతో పవిత్రంగా తయారుచేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో పులిహోర ప్రసాదాన్ని ప్రసాద విభాగంలో తయారు చేయిస్తున్నారు. ఈ ప్రసాదాన్ని ఆలయంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో పశ్చిమ ద్వారం వద్దకు తీసుకెళ్తున్నారు. అయితే ఎంతో పవిత్రంగా భావించే పులిహోర ప్రసాదాన్ని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తీసుకొస్తుండడంతో అపవిత్రం అవుతుందని భక్తులు అంటున్నారు. వెంటనే రామానుజ కూటంలో ప్రసాదాన్ని తయారు చేసి, అక్కడి నుంచి నేరుగా పశ్చిమ ద్వారం వద్దకు తీసుకెళ్లి పంపిణీ చేస్తే బాగుంటుదని పలువురు భక్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఈఓ వెంకట్రావ్‌ను వివరణ కోరగా.. భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు ఉచిత ప్రసాదం పంపిణీ చేసేందుకు గాను రామానుజ కూటంలో సరైన సిబ్బంది, మిషనరీ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. దీంతో గత నెల నుంచి ప్రసాద తయారీ విభాగంలో పులిహోర ప్రసాదాన్ని తయారు చేయించి అక్కడి నుంచి దేవస్థానానికి సంబంధించిన సిబ్బందితో పశ్చిమ ద్వారం వద్దకు తీసుకెళ్తున్నామని వివరించారు.


