రోడ్డు ప్రమాదంలో వార్డు అభ్యర్థి దుర్మరణం
గరిడేపల్లి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీలో ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన జలగం సిద్ధయ్య(45) ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామ 7వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. మంగళవారం రాత్రి బైక్‌పై గడ్డిపల్లి నుంచి గరిడేపల్లి వైపు వెళ్తున్నాడు. పొనుగోడు గ్రామ శివారులోకి వెళ్లగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్‌కు ఉన్న కల్టీవేటర్ బైక్‌కు తగలడంతో సిద్ధయ్య కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సిద్ధయ్యను 108 వాహనంలో సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు మృతి
ఫ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి..
ఫ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన నరసయ్య
కోదాడ : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు చలిగంటి నరసయ్య(80) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో నరసయ్య చురుగ్గా పొల్గొన్నారు. మలిదశ ఉద్యమంలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇటీవలే ఆయన సతీమణి కూడా మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నరసయ్య మృతదేహాన్ని పలువురు తెలంగాణ ఉద్యమకారులు సందర్శించి నివాళులర్పించారు.


