తొలివిడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సమాప్తం
రెండవ విడత ఎన్నికలు జరుగుతున్న భువనగిరి, వలిగొండ, బీబీనగర్, పోచంపల్లి, రామన్నపేట మండలాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటికి తిరిగి తమను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తమ మద్దతు దారుల కోసం రోడ్‌షోలు, గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 14న రెండో విడత ఎన్నికల్లో మెజార్టీ స్థానాల విజయంపై ప్రధాన పార్టీలు కన్నేశాయి.
సాక్షి, యాదాద్రి : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి. తమ ప్రధాన మద్దతుదారులను గెలిపించేందుకు ప్రధాన పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజాపేట, ఆత్మకూర్ (ఎం) మండలాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. చివరి రోజు మంగళవారం సైతం ప్రచారంతో హోరెత్తించారు. బహిరంగ ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. మరోవైపు రెండవ విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో ప్రచారం జోరందుకుంది.
జనరల్, బీసీ స్థానాల్లో తీవ్ర పోటీ
జనరల్, బీసీ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ప్రచారం ముగియగానే అభ్యర్థులు తమ ప్రత్యర్థులు ఓటుకు ఎంత ఇస్తున్నారో తెలుసుకుని అంతకంటే కొంత ఎక్కువ ఇచ్చేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఎలాగైనా గెలిచితీరాలని డబ్బు, మద్యంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ఆధారంగా తమకు పడే ఓట్ల కోసం గుట్టుచప్పుడు కాకుండా డబ్బుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. ఏ దారిలో ఓటరుకు డబ్బులు చేరవేయాలని అభ్యర్థులు చూస్తుంటే.. డబ్బులు ఎవరు పంచుతున్నారంటూ ఓటర్లు ఇప్పటికే ఆరా తీస్తున్నారు.
వలస వెళ్లిన వారి ఓట్లు కీలకం కావడంతో..
జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన ఓటర్లకు ముందు నుంచే టచ్‌లో ఉన్న అభ్యర్థులు వారిని గ్రామాలకు రప్పిస్తున్నారు. వలస వెళ్లిన వారి ఓట్లు కీలకం కావడంతో వాటిని తమ ఖాతాలో వేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు గ్రామాలకు వచ్చేందుకు వాహన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా వచ్చి తమకు ఓటు వేసినందుకు ఫోన్‌పే లేదా ఇతరత్రా ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా నగదును ముందస్తుగా ముట్టజెప్పే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
ఒకరిని మించి మరొకరు ఖర్చు
నామినేషన్ల ఉపసంహరణ రోజు నుంచి కొందరు నాయకులు, ఓటర్లు సానుభూతిపరులను మద్యం మత్తులో ముంచేశారు. ఇప్పుడు ఓటర్లు చేజారకుండా ఉండేందుకు అభ్యర్థులు ఏ వాడ ఓటర్లను ఆ వాడలో ప్రత్యేక సిట్టింగులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం మద్యం డంప్ చేసి వారికి తాగినంత అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే వాతావరణం నేడు, రేపు రెండు రోజుల పాటు అభ్యర్థులకు తప్పేలా లేదు. ముందు ఖర్చు పెట్టేందుకే ఆలోచించిన అభ్యర్థులు పోలింగ్ సమయం దగ్గర పడటంతో ఒకరిని మించి మరొకరు ఖర్చు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పలువురు అభ్యర్థులు తమకు వచ్చిన ఎన్నికల గుర్తులను ఓటర్లకు పంచుతున్నారు. ప్రధానంగా ఉంగరం గుర్తు వచ్చిన అభ్యర్థులు సిల్వర్, రాగి ఉంగరాలు అందజేస్తున్నారు. స్టూలు గుర్తు వచ్చిన వారు వాటిని పంచుతున్నారు. ఇంకా మిక్సీలు, చీరలు, సెల్‌ఫోన్‌లు, క్రికెట్ బ్యాట్‌లు పంపిణీ చేస్తున్నారు.
మొదటి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం : కలెక్టర్
భువనగిరిటౌన్ : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల సంఘం కమిషన్ సభ్యులతో కలిసి ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి అయిందని, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరిగేలా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఎక్స్‌పెండీచర్ పరిశీలకుడు శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఫ రేపు పోలింగ్, ఫలితాల వెల్లడి
ఫ చివరి రోజు హోరెత్తించిన అభ్యర్థులు
ఫ ఎలాగైనా గెలిచి తీరాలని డబ్బు,
మద్యంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం


