పోక్సో కోర్టు జడ్జిగా మిలింద్‌కాంబ్లె
భువనగిరిటౌన్ : ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు (పోక్సో) న్యాయమూర్తిగా మిలింద్‌కాంబ్లెను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధిపేట ప్రధాన సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్న ఆయన అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది పోక్సో కోర్టుకు బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముక్తిదా పోక్సో కోర్టు ఇంచార్జ్‌గా ఉన్నారు. మిలింద్‌కాంబ్లె సోమవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.
15న లోక్ అదాలత్
భువనగిరిటౌన్ : రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఆదేశానుసారం ఈనెల 15వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 1,147 కేసులు రాజీకి ఆమోదయోగ్యమైనవిగా గుర్తించారు. కక్షిదారులు లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని, పోలీసు అధికారులు, న్యాయవాదులు సహకరించాలని జిల్లా ప్రధాన జడ్జి జయరాజు పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి
భువనగిరి: వాతావరణం అనుకూలిస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన భువనగిరి మండలం అనంతారంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. మాయిశ్చర్ యంత్రాలను చెక్ చేశారు. రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా.. అని అడిగి తెలుసుకున్నారు. నిర్దిష్టమైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటా వేసి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. అవసరం మేరకు లారీలు పంపిస్తామని, వాతావరణంలో మళ్లీ మార్పులు రాకముందే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. తేమ శాతంలో వ్యత్యాసం రాకుండా మాయిశ్చర్ యంత్రాలను సరిగా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఆయన వెంట రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు ఉన్నారు.
నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: పంచనారసింహుడి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనలో భాగంగా ఆండాళ్‌దేవికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం వేళ అమ్మవారిని సుందరంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఇక ప్రధానాలయంలోనూ సంప్రదాయ పర్వాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం, ఆరాధన, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు.
పోక్సో కోర్టు జడ్జిగా మిలింద్‌కాంబ్లె


