పశుసంపదను కాపాడేందుకే టీకాలు
భూదాన్‌పోచంపల్లి: పశుసంపదను కాపాడేందుకే పశువైద్య, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ గోపి తెలిపారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరులో పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, పశుసంవర్థకశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వైరస్ వల్ల పశువుల్లో నోరు, గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి అనతి కాలంలోనే ఇతర పశువులకు వ్యాపిస్తుందన్నారు. వ్యాధి నివారణకే టీకాలు వేస్తున్నామని, రైతులు అపోహపడవద్దని సూచించారు. పశుసంపదను పెంచాలని, పశుసంవర్థకశాఖలో అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వెటర్నరీ అధికారులపై ఉందన్నారు. గ్రామాలను దత్తత తీసుకొని రైతులకు మరింత చేరువ కావాలని సూచించారు. పశువులకు ఉచిత టీకాలు, ఫీడు అందజేయడంతో పాటు బీమా సౌకర్యం కల్పించేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శిబిరంలో 700 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు, 150 పశువులకు వైద్య చికిత్స, 800 మూగజీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అలాగే రైతులకు ఉచిత కిట్లు అందజేశారు. కార్యక్రమంలో వెటర్నరీ యూనివర్సిటీ డీన్ ఉదయ్‌కుమార్, అసోసియేట్ డాక్టర్లు డి.మాధురి, కల్యాణి, విశ్వేశ్వర్, కవిత, జిల్లా పశువైద్యాధికారి జానయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, పశువైద్యులు కిషోర్, రాంచంద్రారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పృథ్వి, శ్రీకాంత్, అశోక్‌బాబు, శ్రీనివాస్, రఘు, ఏఓ శైలజ, జమీల్, గోపాలమిత్రలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఫ పశువైద్య, పశుసంవర్థక శాఖ
రాష్ట్ర డైరెక్టర్ గోపి


