యాదగిరి క్షేత్రంలో నేడు కార్తీక పూజలు
యాదగిరిగుట్ట: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బుధవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారి నిత్య కల్యాణం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు గోష్టి, గర్భాలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఉభయ దర్శనాలు ప్రారంభిస్తామని, సాయంత్రం 6.30 గంటలకు ఆకాశ దీపారాధన జరిపిస్తామని తెలిపారు.
ఆంజనేయుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి మంగళవారం అర్చకులు ఆకుపూజ నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతో పాటు పాలతో అభిషేకం నిర్వహించారు. ఆంజనేయస్వామిని సుగంధ ద్రవ్యాలు, పూలతో అలంకరించి, నాగవల్లి దళార్చన చేపట్టారు. ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవలు కొనసాగాయి.
సురేంద్రపురిలో
వేంకటేశ్వరస్వామి కల్యాణం
భువనగిరి : మండలంలోని వడాయిగూడెం గ్రామ పరిధిలోని సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర ఆలయంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు స్వామి వారికి పంచామృతాభిషేకం, తులసి పూజ, పురుష సూక్త హవనం, హోమం, శేషవాహన సేవ, సాయంత్రం ఆకాశదీపారాధన, మంగళహరతి నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుందా ప్రతిభ ప్రతాప్, కాటేపల్లి మాధవరావు, గడ్డం సోంచంద్ పాల్గొన్నారు.
రూ.10 లక్షల విరాళం
యాదగిరిగుట్ట: హన్మకొండకు చెందిన ఏపూరు శ్రవణ్‌కుమార్ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.10 లక్షల విరాళం అందించారు. మంగళవారం స్వామి వారిని దర్శించుకున్న ఆయన నిత్యాన్న పథకానికి రూ.8 లక్షలు, గరుడ ట్రస్ట్‌కు రూ.2 లక్షలు అందించారు. ఈ మేరకు ఇన్‌చార్జి ఈఓ రవి కుమార్‌కు ఆయన చెక్కులను అందించారు.
విద్యార్థులు ఇష్టపడి చదువాలి
సంస్థాన్‌నారాయణపురం : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే భవిష్యత్‌లో ముందుకెళ్తారని డీఈఓ సత్యనారాయణ అన్నా రు. కస్తూర్బా గాంధీ గిరిజన గురుకుల పాఠశాలలో మంగళవారం మానసిక వికాసంపై విద్యార్థులకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. అనంతరం మానసిక నిఽపుణులు విద్యార్థులు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మానసిక నిపుణురాలు డాక్టర్ శైలజ, ఉమామహేశ్వరి, నారాయణ పాల్గొన్నారు.
అక్రమార్కులపై
ఇంటలిజెన్స్ నిఘా
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, ఉద్యోగులపై ఇంటలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. మంగళవారం ఇంటలిజెన్స్‌లో సీఐ స్థాయి అధికారి సిబ్బందితో వచ్చి ప్రధానాలయ పరిసరాలు, పరిపాలనా విభాగంలో నిఘా పెట్టినట్లు సమాచారం. ఇటీవల ఎలక్ట్రికల్ ఈఈ వెంకట రామారావు రూ.1.90 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. దాంతో ఇంటలిజెన్స్ అధికారులు రెండు రోజులుగా ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిసింది. అధికారులు, ఉద్యోగుల పని తీరు, కొండపై దేవస్థానం పరిధిలో జరిగిన టెండర్లలో కాంట్రాక్ట్ తీసుకున్న వారి నుంచి ఏమైనా డబ్బులు డిమాండ్ చేశారా అనే విషయమై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పరిపాలన విభాగంలోని పలు సెక్షన్‌లలో అధికారుల తీరుపై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
యాదగిరి క్షేత్రంలో నేడు కార్తీక పూజలు


