సీఐ చంద్రబాబుకు దక్షతా పదక్ అవార్డు ప్రదానం
భువనగిరి: భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పదక్ అవార్డు అందుకున్నారు. నేర పరిశోధనలో విధులు సమర్థవంతంగా నిర్వహించినందుకుగాను సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పోలీసులకు అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా సీఐ సోమవారం హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ సుధీర్‌బాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
మహిళ అదృశ్యం
చౌటుప్పల్ : పట్టణ కేంద్రానికి చెందిన వివాహిత మహిళ అదృశ్యమైంది. ఆమె భర్త సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ సోమవారం తెలిపారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కై తాపురం గ్రామానికి చెందిన మహిళ(35) కుటుంబసభ్యులతో కలిసి కొంతకాలంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటుంది. భర్త లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీకి వెళ్లిన భర్త ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చాడు. అప్పటికే భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రోప్ స్కిప్పింగ్ ఉమ్మడి జిల్లా సెక్రటరీగా భార్గవచారి
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయినిగూడేనికి చెందిన కన్నెకంటి భార్గవచారి రోప్ స్కిప్పింగ్ ఉమ్మడి జిల్లా సెక్రటరీగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని అల్వాల్‌లో గల పల్లవి మోడల్ స్కూల్లో తెలంగాణ రోప్ స్కిప్పింగ్ రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీధర్ పటేల్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా సంఘం ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీగా కన్నెగంటి భార్గవచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు నియామక పత్రం అందజేశారు.
భార్యను హత్య చేసిన భర్తకు రిమాండ్
కట్టంగూర్ : అనుమానంతో భార్యను హత్య భర్తను కట్టంగూర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో సీఐ కొండల్‌రెడ్డి ఎస్‌ఐ మునుగోటి రవీందర్‌తో సోమవారం వివరాలు వెల్లడించారు. కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామానికి చెందిన మహేష్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహిళను ప్రేమ వివాహం చేసుకుని నిత్యం వేధించడంతో ఆమె విడాకులు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గత సంవత్సరం డిసెంబర్‌లో వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన సుమలతను రెండో వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలలుగా మహేష్ నిత్యం మద్యం సేవించి భార్య సుమలతను వేధించసాగాడు. అంతేకాకుండా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈక్రమంలో ఈనెల 1న తెల్లవారు జామున సుమలతను తీవ్రంగా కొట్టి హతమార్చి చీరతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడు. సుమలత మృతిచెందిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె బంధువులకు ఫోన్ చేసి పరారయ్యాడు. ఈ ఘటన పై సుమలత తల్లి మారెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కొండల్‌రెడ్డి కేసు నమోదు చేశారు. మహేష్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
సీఐ చంద్రబాబుకు దక్షతా పదక్ అవార్డు ప్రదానం


