దుందుభి వాగులో చిక్కుకున్న గొర్రెలకాపరులు
డిండి: దుందుభి వాగు మధ్యలో చిక్కుకున్న గొర్రెల కాపరులకు సోమవారం రెవెన్యూ అధికారులు డ్రోన్ సహాయంతో ఆహారం, నిత్యావసర సరుకులను చేరవేశారు. డిండి మండలం గోనబోయనపల్లి గ్రామానికి చెందిన బద్దెల వెంకటయ్య, సిగ వెంకటయ్య, రగడంపల్లి పెద్దయ్యకు దాదాపు 300 వరకు గొర్రెలు ఉన్నాయి. గొర్రెలను మేపేందుకు సదరు గొర్రెల కాపరులు పది రోజలు క్రితం గ్రామ సమీపంలో దుందుభి వాగు మధ్యలో ఉన్న బీడు భూముల్లోకి తోలుకెళ్లారు. కాగా మోంథా తుపాన్ కారణంగా ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టు అలుగు పోసింది. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్న దుందుభి వాగు వరద ప్రవాహం అధికమైంది. దీంతో గొర్రెల కాపరులు వాగు మధ్యలో చిక్కుకున్నారు. అయితే తమ వెంట తెచ్చుకున్న ఆహార సరుకులు అయిపోవడంతో గ్రామానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారు జామున నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామ శివారులోని వాగు వెంట వ్యవసాయం చేస్తున్న ఓ రైతు తాడు సహాయంతో దుందుభి వాగు దాటుకుంటూ గొర్రెల కాపరుల వద్దకు చేరాడు. రైతు వద్ద ఉన్న ఫోన్‌తో తమకు ఆహార సరుకులు కావాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు తెలిపారు. వెంటనే స్పందించిన దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎస్‌ఐ.బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని వాగు మధ్యలోంచి సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తామని గొర్రెల కాపరులకు తెలియజేశారు. గొర్రెలు తీసుకురావడం ఇబ్బందికరంగా ఉందని, గొర్రెలను విడిచి తాము రాలేమని గొర్రెల కాపరులు తేల్చి చెప్పారు. దీంతో వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అధికారులు డ్రోన్ ద్వారా పంపించారు. వాగు మధ్యలో చిక్కుకున్నందున ఆహారం, ఇతర సరుకులను పంపించటం పట్ల గొర్రెల కాపరులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అధికారుల వెంట స్థానికుడు బద్దెల శ్రీనువాస్ ఉన్నాడు.
ఫ డ్రోన్ సాయంతో ఆహారం,
సరుకులు పంపిన అధికారులు


