సాగర్‌కు తగ్గిన వరద
పెద్దవూర: ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడంతో అధికారులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నాగార్జునసాగర్ జలాశయం క్రస్ట్‌గేట్లను పూర్తిగా మూసి వేశారు. జలాశయం నీటిమట్టం సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు 589.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీ) కాగా ప్రస్తుతం 589.40 అడుగుల(310.2522 టీఎంసీ)లుగా ఉంది. జలాశయం నుంచి కుడి కాల్వకు 8023 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 31424 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 40047 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 31424 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి
నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏడవ యూనిట్‌లో వందరోజులు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు నాగార్జునసాగర్ జెన్‌కో చీఫ్ ఇంజనీర్(సీఈ) మంగేష్‌కుమార్ తెలిపారు. సోమవారం నాగార్జునసాగర్ జెన్‌కో ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర్ జలాశయానికి నీటి రాక ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఏడవ నంబర్ యూనిట్‌లో ఎలాంటి అంతరాయం లేకుండా సోమవారం వరకు విద్యుదుత్పత్తి కొనసాగించినట్లు తెలిపారు. ఈ వంద రోజుల్లో ఈ యూనిట్ ద్వారా 240 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెన్‌కో ఎస్‌ఈలు రఘురాం, శ్రీనివాస్‌రెడ్డి, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ క్రస్ట్‌గేట్లను మూసివేసిన అధికారులు


