పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
వలిగొండ : వలిగొండ మండలంలోని గొల్నేపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్నేపల్లి గ్రామానికి చెందిన మంగళారపు మల్లారెడ్డి(52) తండ్రి ఇటీవల మృతి చెందడంతో సోమవారం దశదినకర్మ నిర్వహించాల్సి ఉంది. అయితే మల్లారెడ్డి ఆదివారం సాయంత్రం సామగ్రి తీసుకురావడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇంటికి ఫోన్ చేసి తాను విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు, బంధువులతో కలిసి మల్లారెడ్డి ఆచూకీ కోసం వెతకగా.. ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశాడు. ఈక్రమంలో గోకారం గ్రామ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని ఉండడంతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పరిశీలించి మల్లారెడ్డిదిగా గుర్తించారు. పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.
యువకుడిపై కేసు నమోదు
చౌటుప్పల్ : మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ సోమవారం తెలిపారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళలు నిల్చున్నప్పుడు, బస్సు ఎక్కే సమయంలో తన సెల్‌ఫోన్‌తో వారి ఫొటోలను తీస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ మహిళ గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. వారు బస్టాండ్‌కు చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి సెల్‌ఫోన్‌లో మహిళలు, యువతుల ఫొటోలను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.


