ఇల్లు కూల్చారని పెట్రోల్ డబ్బాతో నిరసన
మోత్కూరు : అధికారులు తమ ఇంటిని కూల్చివేశారని బాధిత కుటుంబం పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపింది. ఈ సంఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని కాశవారిగూడెం కాలనీలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాశవారిగూడెంలోని ప్రభుత్వ భూమి అయిన సర్వే నంబర్ 402లో మహ్మద్ పకీర్ అహ్మద్ గత 30 సంవత్సరాలుగా గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నాడు. గత పది సంవత్సరాల క్రితం దశల వారీగా ఇంటి నిర్మాణం చేసుకున్నారు. అయితే ఆ స్థలం తనదని, అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి చెందిన బెల్లి నగేష్ తహసీల్దార్‌ను సంప్రదించాడు. కాశవారిగూడెంలో సర్వే నంబర్ 402లోని 242 గజాల భూమి తనదేనని, ప్రభుత్వం క్రీడాకారుల కోటాలో 2020లో తనకు కేటాయించిందని, ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని కోరాడు. దీంతో తహసీల్దార్ అనుమతులతో మున్సిపాలిటీ వారు ఆ ఇంటిని జేసీబీ సాయంతో సోమవారం నేలమట్టం చేశారు. దీంతో మహ్మద్ పకీర్ అహ్మద్ కుటుంబం కాలనీవాసులతో కలిసి కాలనీ ఎదుట పెట్రోల్ డబ్బాతో రోడ్డుపై బైఠాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సర్దిచెప్పడంతో రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సదరు బెల్లె నగేష్ క్రీడాకారుల కోటాలో మోత్కూరు కాశవారిగూడెంలోనే కాకుండా భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇల్లు సమకూర్చిందని, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఎలా కేటాయిస్తారని పేర్కొన్నాడు. అతడికి డబుల్ బెడ్ రూం ఇచ్చినందున మోత్కూరు కాశవారిగూడెంలోని ప్రభుత్వ స్థలం తమకు ఇప్పించాలని అహ్మద్ కోరాడు. ఈ విషయంపై తహసీల్దార్ జ్యోతిని వివరణ కోరగా.. కాశవారిగూడెంలోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి కూల్చివేసినట్లు తెలిపారు.


