బోధనతోనే సరి.. ప్రయోగాలేవీ?
నిధులు రావాలి
భువనగిరి: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ మొక్కుబడిగా మారాయి. ల్యాబ్‌లలో సరైన పరికరాలు, రసాయనాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి నేటికీ నిధులు రాకపోవడంతో వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ఇంటర్‌బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రాక్టికల్స్ పూర్తికాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
11 ప్రభుత్వ కాలేజీలు
జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,295 మంది ఉన్నారు. ప్రాక్టికల్స్ నిర్వహణకు ప్రభుత్వం గత విద్యా సంవత్సరం ఒక్కో కాలేజీకి రూ.25వేల చొప్పున కేటాయించింది. ఈ నిధులతో ప్రాక్టికల్స్‌కు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేశారు. ఈ విద్యాసంవత్సరం పరిస్థితి భిన్నంగా ఉంది. మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులు భావిస్తున్నా.. నిధులు విడుదల చేయడంలో జరుగుతన్న జాప్యం శాపంగా మారింది.
ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
2026 ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. నిధులు రాకపోవడంతో.. గత ఏడాది మిగిలిపోయిన రసాయనాలు, పరికరాలతోనే విద్యార్థులకు అరకొరగా ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే విద్యార్థులతో ప్రాక్టికల్స్ పూర్తి చేయించి పరీక్షలకు సిద్ధం చేసే అవకాశం ఉంటుంది.
‘ప్రైవేట్’లోనూ మొక్కుబడిగా..
జిల్లాలో 23 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు కాలేజీలు మొక్కుబడిగా ప్రాక్టికల్స్ చేయిస్తున్నాయన్న విమర్శలున్నాయి. దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై అవగాహన లేకుండాపోతుంది. కేవలం బోధనతోనే సరిపెడుతున్నాయి.
ఫ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో
పరికరాలు, రసాయనాల కొరత
ఫ గత ఏడాది మిగిలిపోయిన వాటితో అరకొరగా ప్రాక్టికల్స్
ఫ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు
ఫ విద్యార్థుల్లో ఆందోళన
2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించేందుకు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసేందుకు నిధులు రావాలి. త్వరలోనే మంజూరవుతాయి. అప్పటి వరకు గత విద్యా సంవత్సరం మిగిలిన రసాయనాలతో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. పరీక్షల షెడ్యూల్ వచ్చినందున.. నిధులు కూడా విడదల చేస్తారు. ప్రైవేటు కళాశాలలు విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయించపోతే చర్యలు తీసుకుంటాం. –రమణి, డీఐఈఓ


