
పొలం గట్లపై కూరగాయల సాగు
నడిగూడెం: నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం గ్రామానికి చెందిన రైతు పుట్ట కనకయ్య వినూత్నంగా వరి పొలం గట్లపై పలు రకాల కూరగాయలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాధారణంగా వరి పొలం గట్లపై గడ్డి పెరుగుతుండడంతో దానిపై కలుపు మందుల పిచికారీ చేయడం లేదా గడ్డిని కోయడం జరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా పచ్చని పొలాల మధ్య ఉన్న పొలం గట్లు ఖాళీగా ఉండడంతో తన కుటుంబ అవసరాల కోసం బెండ, గోంగూర, దోస, కాకర సాగు చేస్తున్నాడు. గట్లపై కూరగాయలు సాగు చేస్తుండడంతో వరికి చీడపీడల బెడద కూడా తగ్గిందని రైతు కనకయ్య చెబుతున్నాడు. అలాగే గట్లపై సాగు చేసిన కూరగాయలకు ఎలాంటి రసాయన మందులు వాడకుండానే సాగు చేస్తున్నాడు. దీంతో రహదారి మీదుగా వెళ్తున్న ప్రయాణికులు గట్లపై కూరగాయల సాగును ఆసక్తిగా గమనిస్తున్నారు.