
సత్తా చాటిన యువ దర్శకుడు
యాదగిరిగుట్ట: బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్–2025 సెలక్షన్ లిస్టులో యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూర్ గ్రామానికి చెందిన యువ దర్శకుడు నమిలే శివకుమార్ రూపొందించిన ప్రజాపాలన అనే షార్ట్ ఫిల్మ్‌కు చోటు దక్కింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ప్రభుత్వ పాలనా విధానాలు ఎలా ప్రతిబింబిస్తున్నాయనే అంశాన్ని వాస్తవికంగా చూపించేలా షార్ట్ ఫిల్మ్ చేయడంతో తనకు ‘బతుకమ్మ యంగ్ ఫిలిమ్స్ మేకర్స్ ఛాలెంజ్–2025’ సెలక్షన్ లిస్టులో చోటు దక్కినట్లు యువ దర్శకుడు నమిలే శివకుమార్ తెలిపారు. తెలంగాణ ప్రజాపాలనపై 2 నిమిషాల 58 సెకన్ల పాటు రూపొందించిన వీడియోను బతుకమ్మ యంగ్ మేకర్స్ ఛాలెంజ్–2025కు ఈ నెల 4న పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ నెల 9న హైదరాబాద్‌లోని శిల్పారామంలో అవార్డు ఫంక్షన్ నిర్వహించాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉండటంతో వాయిదా పడిందని, త్వరలోనే ప్రభుత్వం అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా షార్ట్ ఫిల్మ్‌లు, పాటలు వచ్చాయని, వీటిని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఫెస్టివల్ టీమ్ ఆధ్వర్యంలో పరిశీలించి సెలక్షన్ లిస్టు తయారు చేశారన్నారు.
తెలంగాణ ప్రజాపాలనపై షార్ట్ ఫిల్మ్ రూపొందించిన చిన్నకందుకూర్ వాసి
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్–2025లో సెలక్షన్ లిస్టులో చోటు