
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీలు
వేములపల్లి: స్కూల్ బస్సును రెండు లారీలు ఢీకొట్టాయి. ఈ ఘటన నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై వేములపల్లి మండలం శెట్టిపాలెం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ఆదిత్య పాఠశాలకు చెందిన బస్సులో విద్యార్థులను తీసుకొచ్చేందుకు రోజుమాదిరిగానే మంగళవారం ఉదయం డ్రైవర్ పెదమాం గిరిబాబు వేములపల్లి మండలం శెట్టిపాలెంకు బయల్దేరాడు. ఈ క్రమంలో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై శెట్టిపాలెం క్రాస్ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా.. వేములపల్లి నుంచి మిర్యాలగూడ వైపు లారీ వస్తుండడం గమనించి డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. అదే సమయంలో మిర్యాలగూడ వైపు నుంచి వస్తున్న కంటెయినర్ ఒక్కసారిగా వెనుక నుంచి బస్సును ఢీకొట్టడంతో బస్సు ముందుకు వెళ్లగా.. మిర్యాలగూడ వైపు వస్తున్న లారీ బస్సును ముందు వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ గిరిబాబు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. లారీ డ్రైవర్ ఆనంద్ నామ్‌దేవ్ మొలేకర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం రహదారిపై స్కూల్ బస్సును, లారీలను పోలీసులు క్రేన్ల సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటన జరిగిన సమయంలో స్కూల్ బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డి. వెంకటేశ్వర్లు తెలిపారు.
డ్రైవర్‌కు స్వల్ప గాయాలు