
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
యాదగిరిగుట్ట రూరల్: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వాటిపై ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో అటుగా అతివేగంగా వస్తున్న గూడ్స్ వాహనం కిందపడిన బైక్ పైనుంచి వెళ్లడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన నీలం నరసింహులు(40) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడు మంగళవారం పని నిమిత్తం సడల నర్సింహులు అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై రాజపేట నుంచి ఆలేరు వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి దడిగె రాములు, మరో ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై ఆలేరు నుంచి రాజపేట వైపు వెళ్తున్నారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలు కాచారం గ్రామ పరిధిలోని పౌల్ట్రీఫాం వద్ద ఎదురెదురుగా ఢీకొనడంతో వారు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ఆలేరు వైపు వెళ్తున్న గూడ్స్ వాహనం అతివేగంతో నీలం నరసింహులు ద్విచక్ర వాహనం పైనుంచి వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి సడల నరసింహులు కాలు విరిగింది. మరో బైక్‌పై ఉన్న రాములుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు నీలం నరసింహులు భార్య నీల సిద్ధమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలియజేశారు.