
ఉద్యోగాల కల్పనే లక్ష్యం
హుజూర్‌నగర్: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ నెల 25న హుజూర్‌నగర్‌లో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో హుజూర్‌నగర్‌లోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. సింగరేణి కంపెనీ, పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో ఐటీ, సేవా, నిర్మాణ, వాణిజ్య, ఫార్మా రంగాలకు చెందిన 150 కంపెనీలు పాల్గొంటాయని, సుమారు 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. 2018 నుంచి పది, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏలో ఉత్తీర్ణులైనవారు, అలాగే 2026లో ఉత్తీర్ణత సాధించబోయే వారు జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హత ఉంటుందని తెలిపారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) ప్రతినిధి వంశీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. జాబ్ మేళా పోస్టర్‌ను మంగళవారం మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించి క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అభ్యర్థులకు ముందుగానే ఏ కంపెనీకి అర్హత ఉందో తెలిపే విధంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. నిరుద్యోగులు 3 నుంచి 5 కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అభ్యర్థులు తమ రెజ్యూమే 5 జిరాక్స్ కాపీలను తీసుకొని జాబ్ మేళాకు రావాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఈటీ అడిషనల్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, డీఐసీ జీఎం సీతారాంనాయక్, సింగరేణి కంపెనీ ప్రతినిధులు శ్రీకాంత్, చందర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి శంకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.