
గుంతలో పడిన లారీ.. డ్రైవర్‌కు గాయాలు
పెద్దవూర: జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై పెద్దవూర మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మూడేళ్లుగా కొనసాగుతున్నాయి. వాహనాలు రాకపోకలు కొనసాగించేందుకు వీలుగా రోడ్డుకు రెండు వైపులా సర్వీస్ రోడ్డు నిర్మించి మధ్యలో పెద్ద గుంతను తీశారు. ఆదివారం రాత్రి ఓ లారీ నేరుగా వచ్చి ఈ గుంతలో పడిపోయింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంబంధిత కాంట్రాక్టర్ గుంత సమీపంలో కేవలం చిన్నపాటి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడంతో మిర్యాలగూడ వైపు నుంచి వచ్చే వాహనదారులకు దగ్గరకు వచ్చే దాకా గుంత కనిపించడం లేదు. గతంలోనూ ద్విచక్ర వాహనాలు, లారీలు, కార్లు సైతం నేరుగా వచ్చి గుంతలో పడిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ద్విచక్ర వాహనదారులు సైతం మృతిచెందారు. సర్వీస్ రోడ్డు ప్రారంభమయ్యే ప్రదేశంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.