
బీసీ రిజర్వేషన్లకు అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర
భువనగిరిటౌన్ : బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీజేపీ మొదటి నుంచి కుట్రలు చేస్తుందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకుడు రాయబండి పాండురంగాచారి అన్నారు. సోమవారం సీపీఐ, బీసీ హక్కుల సాధన సమితి సంయుక్తంగా యాదాద్రి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని కోరుతున్నా బీజేపీకి చీమకుట్టినట్టు లేదని అన్నారు. బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీ అని బీసీలు గుర్తించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజీపీ కుట్రలను తిప్పికొట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 15న నిర్వహించే రాస్తారోకోలో బీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కళ్లెం కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు గోద శ్రీరాములు, కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, ఎండీ ఇమ్రాన్, చెక్క వెంకటేష్, ఉప్పల ముత్యాలు, ఏశాల అశోక్, పల్లె శేఖర్‌రెడ్డి, చిగుర్ల లింగం, పెరబోయిన మహేందర్, వివిధ మండలాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.