
చెరువు కట్టపై అదుపుతప్పిన స్కూల్ బస్సు
మునగాల: చెరువు కట్ట మీదుగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటన మునగాల మండలం నేలమర్రి గ్రామ శివారులో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఉదయం అదే మండలం గుంజలూరు గ్రామంలో 15మంది విద్యార్థులను ఎక్కించుకొని మునగాల మండలం నేలమర్రి గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకునేందుకు వస్తోంది. ఈ క్రమంలో నేలమర్రి గ్రామ శివారులో చెరువు కట్టపై స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఆ చెట్టు లేకపోతే బస్సు నేరుగా చెరువులోకి దూసుకెళ్లేది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో బస్సును పక్కకు తీశారు. బస్సులోని విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ గ్రామానికి వాహనాలు చెరువు కట్ట మీదుగా రావాల్సి ఉందని, కట్ట ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, కట్టను వెడల్పు చేసేలా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి చర్యలు తీసుకోవాలని కోరారు.
చెట్టును ఢీకొని ఆగిపోవడంతో
తప్పిన పెను ప్రమాదం