
కారును వెనుక నుంచి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
● ఒకరికి గాయాలు
చౌటుప్పల్ రూరల్: హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం జంగారెడ్డిపల్లికి గ్రామానికి చెందిన బొంత నర్సింహ, పల్లపు రాజు కారులో ఏపీలోని నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోకి రాగానే కారును వెనక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పల్లపు రాజు గాయపడ్డారు. బొంత నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కుసుమ ఉపేందర్‌రెడ్డి తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండ దిగువన కల్యాణకట్ట వద్ద సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణకట్ట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించి మృతుడి ఎడమ చేతికి బొటన వేలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మృతుడి సుమారు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కల్యాణకట్ట శానిటరీ సూపర్‌వైజర్ పాండురాజు శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ భాస్కర్ వెల్లడించారు.