
ఎలక్ట్రికల్ షాపు గోదాంలో అగ్ని ప్రమాదం
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేటలో ఎలక్ట్రికల్ షాపు గోదాంలో ఆదివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌పేటలో ఫ్‌లైవర్ సర్వీస్ రోడ్డు వెంట ఉన్న శ్రీలక్ష్మి పవన్ ఎలక్ట్రికల్స్, విజయలక్ష్మి ఆటోమోటివ్స్‌కు సంబంధించిన గోదాం నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పొగలు రావడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ నిర్వాహకులు గోదాం యజమానులకు సమాచారం అందించారు. వారు వచ్చి తాళాలు తీసి చూడగా అప్పటికే షాపు మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నామని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయారు.