
వరుస వర్షాలతో ‘బంతి’కి కష్టాలు
బంతి తోట మునిగిపోయింది
తుర్కపల్లి: వరుస వర్షాల కారణంగా బంతి సాగు చేసిన రైతులు తీవ్రనష్టాన్ని ఎదుర్కొంటున్నారు. మొగ్గ దశలోనే వర్షాలు కురవడంతో మొక్కలు ఎదగకపోవడం, పూసిన పూలు వాడిపోవడం రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది. రైతులు చెబుతున్న ప్రకారం అర ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఎరువులు, మందులు, కలుపు తీయడం, విత్తనాలు, నారు ఖర్చులు అన్నీ కలిపి రైతుల భారం మరింత పెరిగింది. అయితే ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పండుగల కోసం సాగు..
ప్రతి ఏడాది బతుకమ్మ, నవరాత్రి, దీపావళి పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని బంతి సాగు ప్రారంభించే రైతులు, ఈ సారి వరుస వర్షాల కారణంగా నష్టపోతున్నారు. తుర్కపల్లి మండలంలోని నాగాయిపల్లి, పల్లెపహాడ్, గోపాల్‌పురం, ధర్మారం, రామోజీనాయక్ తండా, మర్రికుంట తండా, మోతిరాంతండా, దయ్యంబండా ప్రాంతాల్లోనే 100 ఎకరాలకు పైగా బంతి సాగు చేశారు. కానీ అధిక వర్షాలతో మొక్కల పెరుగుదల ఆగిపోవడం, పూత రాకపోవడం, ఇప్పటికే పూసిన పూలు వాడిపోవడం వల్ల దిగుబడి ఆశాజనకంగా లేదని రైతులు వాపోతున్నారు. అధిక వర్షాలు, తేమ కారణంగా చీడపీడలు, పీల్చే పురుగులు, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు వంటివి, ఎక్కువగా పెరుగుతాయి. ఇది పంటకు మరింత నష్టం కలిగిస్తుందని పేర్కొంటున్నారు. గతేడాది మంచి లాభాలు తెచ్చిన బంతి సాగు ఈసారి రైతులను అప్పల బారిన పడేలా చేస్తోందని వాపోతున్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలను వినియోగించి రైతులకు తోడ్పాటు అందించాలని, తడి పంటల కోసం విత్తనాలు, ఎరువులు, క్రాప్ పైపులను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫ ఎదగని మొక్కలు
ఫ వాడిపోతున్న పూలు
ఫ ఆందోళనకు గురవుతున్న రైతులు
వర్షాల కారణంగా మా బంతి తోట మొత్తం నీట మునిగింది. ఉత్పిత్తి తగ్గి, ధరలు కూడా తగ్గితే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వం సాయం అందించకపోతే రైతులు మరింత కష్టాల్లో పడతారు.
– పాచ్య, రైతు, గోగూల్‌గుట్టతండా

వరుస వర్షాలతో ‘బంతి’కి కష్టాలు