
పెరుగుతున్న బాలాజీనాయక్ బాధితులు
ఫ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు
నల్లగొండకు వచ్చిన కొందరు
నల్లగొండ: వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ బాధితులు పెరుగుతున్నారు. అధిక వడ్డీ ఆశచూపి అమాయక ప్రజల నుంచి రూ.వందల కోట్లు వసూలు చేసిన పీఏపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీనాయక్‌పై ఇప్పటికే పోలీస్ శాఖ కేసులు నమోదు చేసింది. బాధితుల ఆందోళనపై ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో శుక్రవారం పుట్టంగండి గ్రామానికి చెందిన కొందరు బాధితులు లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు పుట్టంగండి వాసి ముడావత్ శ్రీనునాయక్ ఆధ్వర్యంలో ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు నల్లగొండకు వచ్చారు. సాయంత్రం వరకు వేచి చూశారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో శనివారం కలవనున్నట్లు శ్రీనునాయక్ పేర్కొన్నారు.
నిజాయితీ చాటుకున్న
ఆర్టీసీ కండక్టర్
కోదాడ: కోదాడ– ఖమ్మం రూట్‌లోని ఆర్టీసీ బస్సులో శుక్రవారం ప్రయాణించిన ఓ ప్రయాణికురాలు ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగ్‌ను మరిచిపోయింది. దానిని గమనించిన బస్సు కండక్టర్ ప్రవీణ్‌కుమార్ కోదాడ కంట్రోలర్‌కు అందజేశాడు. బ్యాగ్ మరిచిపోయిన ప్రయాణికురాలు కోదాడ ఆర్టీసీ అధికారులను సంప్రదించడంతో సెక్యూరిటీ అధికారులు సదరు బ్యాగ్‌ను ప్రయాణికురాలికి అందజేశారు. లక్షన్నర విలువల గల వస్తువులు ఉన్న బ్యాగ్‌ను తిరిగి అప్పగించిన ఆర్టీసీ అధికారులకు, కండక్టర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఈమేరకు కండక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను డిపో మేనేజర్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.
భార్య అదృశ్యంపై ఫిర్యాదు
నల్లగొండ: తన భార్య కనిపించడం లేదని ఓ వ్యక్తి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నల్లగొండలోని వెంకటరమణ కాలనీకి చెందిన గుంజ రజనీకాంత్ తన భార్య దీపిక శుక్రవారం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిందని, ఆమె సమాచారం తెలియడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రజనీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వన్‌టౌన్ పోలీసులు పేర్కొన్నారు. కాగా, వారికి పిల్లలు లేరని తెలిపారు.

పెరుగుతున్న బాలాజీనాయక్ బాధితులు