
యాసంగి సన్నాలకు అందని బోనస్
రామన్నపేట: గత యాసంగి సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున ప్రభుత్వం అందించాల్సిన బోనస్ డబ్బులు నేటికీ విడుదల చేయలేదు. ప్రభుత్వం ఎన్నికల ముందు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. 2024–25 వానాకాలం సీజన్‌కు సంబంధించి సన్నధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ డబ్బులు చెల్లించింది. అయితే గత యాసంగికి సంబంధించిన బోనస్ డబ్బులు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో వాటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
2,75,315 ఎకరాల్లో వరి సాగు
గత యాసంగిలో 2,75,315 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.849.32కోట్ల విలువైన 3,67,479మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తుందనే ఆశతో యాసంగిలో దిగుబడి తక్కువ వస్తుందని తెలిసికూడా జిల్లాలో 367 మంది రైతులు సన్నరకం ఽవరి సాగు చేశారు. ప్రభుత్వం రైతుల నుంచి 1,291.680 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేసింది. మిగిలిన ధాన్యంతోపాటు సన్నధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.2,320 మద్దతు ధరను చెల్లించింది. క్వింటాకు రూ.500 లెక్కన బోనస్ డబ్బులు రూ.64,58,400 పెండింగ్‌లో ఉంచింది. ధాన్యం విక్రయించి నాలుగు నెలలు దాటినా ప్రభుత్వం బోనస్ డబ్బులు విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం, పది రోజుల్లో వానాకాలం సీజన్ కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
ఫ ప్రభుత్వం చెల్లించాల్సిన
బకాయి రూ.64.58 లక్షలు
ఫ సన్నధాన్యం అమ్మిన రైతులు
367 మంది
ఫ కేంద్రాల్లో కొనుగోలు చేసింది
1,291.680 మెట్రిక్ టన్నులు
ఫ నాలుగు నెలలు దాటినా
విడుదలకాని సొమ్ము
ఫ వానాకాలం పంట కూడా
చేతికొచ్చిందని రైతుల ఆవేదన