
జీపీఓలు పారదర్శకంగా పనిచేయాలి
సాక్షి, యాదాద్రి : గ్రామపాలన అధికారులు (జీపీఓలు) రెవెన్యూ వ్యవస్థ పటిష్టతకు పారదర్శకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. కొత్తగా నియామకమైన గ్రామ పాలన అధికారులకు బుధవారం భువనగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. మీపై నమ్మకంతో పరిపాలన అధికారులుగా తిరిగి పోస్టింగ్ ఇచ్చామన్నారు. ప్రజలకు అన్ని సర్వీసులు అందించేది రెవెన్యూ శాఖ మాత్రమే అన్నారు. భూభారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ గ్రామ పరిపాలన అధికారులు తమ విధులు బాధ్యతతో నిర్వర్తించాలన్నారు. గ్రామ రెవెన్యూ రికార్డులు, లెక్కలను సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, సురేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృతిక, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, జీపీఓలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు