
పురుగుల మందు తాగి..
చండూరు: పురుగుల మందు తాగి ఆశా వర్కర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేటలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. అంగడిపేటకు చెందిన పెద్దబోయిన రేణుక ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. ఆమెకు భర్త, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండేళ్ల క్రితం కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుమార్తె అదే గ్రామంలో తమ ఇంటి ఎదురుగా ఉండే ఇడికూడ నాగరాజును ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన రేణుక మూడు నెలలుగా నల్లగొండలో తన తల్లి వద్ద ఉంటోంది. సోమవారం అంగడిపేటకు వచ్చిన రేణుక కుమార్తె వద్దకు వెళ్లి తమ వద్దకు రావాలని కోరగా.. ఆమె తిరస్కరించింది. దీంతో సూసైడ్ నోట్ రాసి ఇంట్లో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను నల్లగొండకు తరలింస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.