
గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురి అరెస్ట్
సూర్యాపేటటౌన్: గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 120 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం సూర్యాపేట ఎస్పీ నరసింహ జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదారాబాద్‌కు చెందిన కణం రమేష్ నిత్యాన్నదానం చేసే ఆశ్రమాలకు బియ్యం సప్లై చేస్తుంటాడు. సరైన ఆదాయం లేక మిల్లర్లకు డబ్బు చెల్లించలేకపోయాడు. వ్యాపారం బాగోలేదని మానసిక ప్రశాంతత కోసం కుటుంబానికి దూరంగా ఉండి ఓం శాంతి బ్రహ్మకుమారి ఆశ్రమంలో తిరుగుతుండగా.. అతడికి ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన ఎరకమ్మ అలియాస్ రోహిణి పరిచయమైంది. వీరిద్దరు కలిసి గత రెండేళ్ల నుంచి విజయవాడలో ఉంటూ బియ్యం వ్యాపారం చేయగా మళ్లీ నష్టం వచ్చింది. దీంతో గంజాయి వ్యాపారం చేస్తే తన అప్పులు తీరుతాయని రమేష్ ఎరకమ్మకు చెప్పగా ఆమె సరే అంది. ఇరువురు కలిసి విజయనగరం జిల్లాకు చెందిన అశోక్‌ను విజయవాడకు పిలుపించుకున్నారు.
కోదాడ శివారులో 110 కిలోల గంజాయి..
అశోక్ ద్వారా ఒడిశా నుంచి 110 కిలోల గంజాయిని సెప్టెంబర్ 22న విజయవాడకు తెప్పించుకొని.. దానిని రమేష్ బస్తాలలో ప్యాక్ చేసి తన కారులో సెప్టెంబర్ 23న హైదరాబాద్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యలో కోదాడ పట్టణ శివారులో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండటం గమనించాడు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో కోదాడ శివారులోని భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఒక షెడ్ లోపలికి వెళ్లి 110 కిలోల గంజాయిని పడేశాడు. అనంతరం ఈ నెల 5వ తేదీన మళ్లీ 10 కిలోల గంజాయిని ఒడిశా నుంచి తెప్పించి.. ఈ నెల 6న ఆ గంజాయిని హైదరాబాద్‌లో అమ్మేందుకు రమేష్ కారులో బయల్దేరారు. కోదాడ పట్టణ శివారులోని కట్టకొమ్ముగూడెం ఎక్స్ రోడ్ దగ్గరకు రాగానే పోలీసులను చూసి కారు వేగంగా వెళ్తుండటంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. రమేష్ వద్ద 10 కిలోల గంజాయి, 6 సెల్‌ఫోన్లు, కారు స్వాదీనం చేసుకున్నారు. రమేష్‌ను విచారించగా.. గత నెల కోదాడ వద్ద 110కిలోల గంజాయిని ఎరకమ్మ, అశోక్‌లతో కలిసి వదిలేసినట్లు ఒప్పుకోవడంతో వారిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
ఫ 120 కిలోల గంజాయి సీజ్