యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు ఖడ్గేకార్ జగదీశ్వర్, భాగ్యవతి, వినయ్, ఈషా, గరుడపల్లి బాలేష్ గుప్త, అన్నపూర్ణదేవి, శివప్రసాద్, స్రవంతి కలిసి రూ.3లక్షల విలువ చేసే ప్రభను అందజేశారు. మంగళవారం స్వామివారిని దర్శించుకొని, అనంతరం ముఖ మండపంలోని ఆలయ అధికారులు, అర్చకులకు రాగి రేకుపై బంగారు పూతతో కూడిన ప్రభను అందజేశారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
తుర్కపల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. తుర్కపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఒంగోలు జిల్లా కేంద్రానికి చెందిన శ్రీను ఉపాధి నిమిత్తం భువనగిరికి వలస వచ్చి మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడు రోజుల క్రితం మేస్త్రీ పని నిమిత్తం భువనగిరి నుంచి తుర్కపల్లి మండలంలోని రామోజీనాయక్ తండాకు వస్తుండగా పెద్దతండా గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తక్యుద్దీన్ తెలిపారు.
విద్యుదాఘాతంతో నాలుగు గేదెలు మృతి
అడవిదేవులపల్లి: అడవిదేవులపల్లి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ భూమి వద్ద సోమవారం రాత్రి కురిసిన గాలివానకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మంగళవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన దాసరి సైదయ్య, కలకొండ భిక్షం, రావుల దుర్గయ్య, కొత్ర మట్టయ్యకు చెందిన నాలుగు గేదెలు మేతకు వెళ్లి సమీపంలోని అయ్యేరు కుంటలో నీరు తాగి వస్తుండగా ఆ విద్యుత్ తీగలకు తాగి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలికి గాయాలు
భువనగిరి: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలికి గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి పట్టణంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి భువనగిరి బస్టాండ్‌లోకి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలిని హైదరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్తున్న వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వృద్ధురాలిని చికిత్స నిమిత్తం భువనగిర జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.

యాదగిరీశుడికి బంగారు ప్రభ అందజేత