
అధిక వడ్డీ ఆశచూపి మోసం
పెద్దఅడిశర్లపల్లి: అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి పలువురి వద్ద డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన వడ్డీ వ్యాపారి ఇంటిని మంగళవారం బాధితులు ముట్టడించారు. అతడి ఇంటికి నిప్పు పెట్టి దహనం చేశారు. పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన వడ్డీ వ్యాపారి బాలాజీనాయక్ గ్రామస్తులు, బంధువులతో పాటు దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు వసూలు చేసి తిరిగి చెల్లించడంలేదు. దీంతో రెండు నెలల క్రితం బాధితులు నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో బాలాజీనాయక్‌ను ఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించగా.. మూడు నెలల్లో బాధితులందరికి డబ్బులు ఇస్తానని అంగీకరించాడు. అప్పటి నుంచి రోజులు గడిచే కొద్దీ మరితం సమయం ఇవ్వాలని బాధితులను కోరుతూ కాలయాపన చేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా అతడు అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. మిర్యాలగూడకు చెందిన రమావత్ సరియా తనతో పాటు తన బంధువుల వద్ద అప్పుగా తీసుకొని బాలాజీనాయక్‌కు ఇచ్చింది. గత మూడు నెలలుగా బాలాజీనాయక్ చుట్టూ తిరగుతున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన సరియా సోమవారం మిర్యాలగూడలో పురుగుల మందు తాగింది. చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మండలంలోని పలువురు బాధితులు మంగళవారం బాలాజీనాయక్ ఇంటి వద్దకు రాగా.. ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఆగ్రహించిన బాధితులు అతడి ఇంటికి నిప్పు పెట్టి ఫర్నీచర్‌ను బయటకు తీసుకొచ్చి దహనం చేశారు.
ఫ వడ్డీ వ్యాపారి ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు