
అద్భుత క్షేత్రాన్ని అచ్చుగుద్దినట్లుగా..
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఓ చిత్రకారిణి తన కుంచెతో అద్బుతంగా గీసి భక్తులను ఆకట్టుకుంది. భువనగిరి పట్టణానికి చెందిన నామోజు లావణ్య మంగళవారం ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు యాదగిరీశుడి ఆలయ కల్యాణ మండపం నుంచి ఆలయాన్ని చూస్తూ ప్రత్యక్షంగా చిత్రాన్ని గీసింది. ఆలయ నిర్మాణం, సప్త గోపురాలు, బంగారు విమాన గోపురం, మాఢ వీధుల్లో భక్తులు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను అచ్చుగుద్దినట్లు గీసి రంగులతో తీర్చిదిద్దింది. ఆలయ రూపాన్ని లావణ్య ఎడమచేతితో గీస్తుంటే భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాను గీసిన చిత్రాన్ని ఆలయాధికారులకు లావణ్య అందజేసింది. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. తాను కొంతకాలంగా ఆలయాలను, పర్యాటక ప్రదేశాలకు వెళ్లి చిత్రాలు గీసి, నిర్వాహకులకు అందిస్తున్నట్లు వెల్లడించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఉన్న ఆలయాలను సందర్శించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే భద్రాచలం, చార్మినార్, స్వర్ణగిరి, ఏపీలోని ఉమామహేశ్వరస్వామి ఆలయం, ఖైరాతాబాద్ గణపతి, వెయ్యి స్తంభాల గుడి సందర్శించి చిత్రాలను గీసినట్లు తెలిపింది. తాను డిగ్రీ వరకు చదువుకున్నానని, చిత్రాలు ఎడమచేతితో గీస్తున్నట్లు వెల్లడించింది.