
తనిఖీలకే పరిమితమా..!
కలెక్టర్ ఆదేశాల మేరకు
చర్యలు తీసుకుంటాం
భువనగిరి: జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అబార్షన్లు చేయడం, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తల్లి, మరొక చోట శిశువు మృతి చెందడం లాంటి సంఘటనలు గత జూలై, ఆగస్టులో చోటుచేసుకున్నాయి. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో తనిఖీలు చేసేందుకు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. గత జూలై 20న ప్రారంభమైన తనిఖీలు ఆగస్టు 15వ తేదీ లోపు పూర్తిచేశారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కేవలం తనిఖీలకే పరిమితమా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
ఈ అంశాలపై తనిఖీలు
జిల్లాలో ప్రస్తుతం 171 ప్రైవేట్ ఆస్పత్రులు, 80 వరకు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ఆయా ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 80శాతం వరకు ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగానే వ్యవహరిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ సమయంలో పేర్లు ఉన్న వారు కాకుండా మరొకరు వైద్యసేవలందించడం, బయోమెడికల్ వేస్ట్ మెనేజ్‌మెంట్ నిర్వహణ లేకపోవడం, ఆర్‌ఎంపీలు, ఆయుష్ వైద్యుల ద్వారా వైద్య సేవలందించడం, శిక్షణ లేని పారామెడికల్ సిబ్బంది ఉండడం, వెలుతురు, గాలి, నీటి సౌకర్యం లేకుండా ఉండటంతో పాటు ఇరుకై న గదుల్లో నిర్వహణ, ఫైర్ సిస్టం లేకపోవడం వంటి వాటిని గుర్తించినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో గుర్తించిన అంశాలతో కూడిన నివేదికను అధికారులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సమర్పించారు. ఈ నివేదిక అందజేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
పైరవీలు చేస్తున్నారని ఆరోపణలు
సాధారణంగా జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో ప్రత్యేక అధికారుల బృందం తనిఖీలు నిర్వహించాలి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం గాని అవసరమైతే సీజ్ చేయడం గాని చేయాలి. ప్రస్తుతం ఓ వైపు అధికారులు తనిఖీ చేస్తుండగానే మరోవైపు ఆస్పత్రుల నిర్వాహకులు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా పైరవీలు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో వరుసగా జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశాం. వారు తనిఖీలు నిర్వహించి నివేదికను అందజేశారు. ఈమేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ మనోహర్, డీఎంహెచ్‌ఓ
ఫ ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్
సెంటర్లలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు
ఫ 80శాతం వరకు నిబంధనలకు
విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు
గుర్తించిన అధికారులు
ఫ నివేదిక అందించి నెలరోజులు దాటినా చర్యలు తీసుకోవడంలో అలసత్వం