
నిజాయితీకి నిలువుటద్దం జీఎస్‌రెడ్డి
కోదాడ: నిజాయితీకి నిలువుటద్దం.. నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత.. తన ఆస్తిని సైతం ఫణంగా పెట్టి ప్రజలకు ఖర్చుచేసిన గొప్ప వ్యక్తి ఉమ్మడి నల్ల గొండ జిల్లా తొలి జెడ్పీ చైర్మన్ గోపు శౌరిరెడ్డి (జీఎస్‌రెడ్డి). మంగళవారం జీఎస్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. ‘పల్లె సీమల ప్రగతికి నా వంతు కృషి చేయాలన్నదే నా సంకల్పం. గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నా.. అవసరమైతే నా ఆస్తులను ఖర్చుచేస్తా.. నా కుటుంబ సభ్యులెవరూ నా సంపాదన మీద ఆధారపడకూడదన్నదే నా అభిమతం’. 1952వ సంవత్సరంలో హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా గోపు శౌరిరెడ్డి(జీఎస్‌రెడ్డి) తన సన్నిహితులతో అన్న మాటలవి. అన్న మాటలకు కట్టుబడి నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా.. తనకున్న 60 ఎకరాల భూమిని రాజకీయాల్లో పోగొట్టుకుని తన నలుగురు కుమారులు వేరుపడున్న సమయంలో ఒక్కొక్కరికి రూ.40 వేల అప్పు పంచిన నేత ఆయన.
తొలిజిల్లా పరిషత్ చైర్మన్‌గా..
ఉమ్మడి నల్లగొండ మొదటి జిల్లా పరిషత్ చైర్మన్‌గా, మూడు విడతలు మిర్యాలగూడ పార్లమెంట్ సభ్యుడిగా జీఎస్‌రెడ్డి సేవలందించారు. మఠంపల్లి గ్రామానికి చెందిన గోపు శౌరిరెడ్డి 1917లో జన్మించారు. ఆయనను జీఎస్.రెడ్డి అంటేనే గుర్తిస్తారు. ఆయన అసలు పేరు నూటికి 90 మందికి తెలియదంటే ఆశ్చర్యపోక తప్పదు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన జీఎస్.రెడ్డి 1941–46 మధ్య కాలంలో సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ పాఠశాలలో ఉపాధ్యాయడిగా పనిచేశారు. ఆ తరువాత 1947–50 వరకు హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1952లో హుజూర్‌నగర్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1962లోఉమ్మడి నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికై న ఆయన.. 1965 వరకు పదవిలో కొనసాగారు. ఈ సమయంలోనే కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాల్లో అనేక గ్రామాలకు రహదారులు వేయించారు. మఠంపల్లి మండలం యాతవాకిళ్లలో 5 వేల ఎకరాలకు సాగునీరు అందించే వేములూరి ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ప్రస్తుత నల్లగొండ జెడ్పీ భవన స్ధలం, హుజూర్‌నగర్‌లో పంచాయతీ స్థలాలు ఆయన హయంలో సేకరించినవే. జిల్లాలో 80కి పైగా హైస్కూళ్లు ఏర్పాటు చేశారు.
మూడు విడతలు ఎంపీగా..
జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయన పనితీరును గుర్తించి తొలిసారి మిర్యాలగూడ ఎంపీ స్థానం నుంచి పార్లమెంట్‌కు పోటీకి నిలిపింది. తొలిసారి 1967–71 వరకు, రెండోసారి 1971–75 వరకు, మూడోసారి 1980–84వరకు ఆయన ఎంపీగా సేవలందించారు. క్యాథలిక్ సొసైటీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన జీఎస్.రెడ్డి.. 1965వ సంవత్సరంలో మదర్ థెరిస్సాను నల్లగొండకు రప్పించి అనేక సేవా కార్యాక్రమాల్లో పాల్గొనేలా చేశారు.
నాటితరం నేత.. నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత
ఉమ్మడి జిల్లా తొలి
జెడ్పీ చైర్మన్ జీఎస్‌రెడ్డి
నేడు జీఎస్‌రెడ్డి వర్ధంతి
జీఎస్‌రెడ్డి వర్ధంతిని మంగళవారం నిర్వహించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టిన జీఎస్‌రెడ్డి.. 1986 అక్టోబర్ 7వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళుతుండగా సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు పెద్ద కుమారుడు రాయపురెడ్డి, మనవడు అభినయ్‌రెడ్డి మృతి చెందారు. ఆయనకు నలు గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమారుడు, రాజారెడ్డి, మూడో కుమారుడు ప్రతాపరెడ్డి ఐదు సంవత్సరాల క్రితం మృతి చెందారు. ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు, చిన్న కుమారుడు బాలిరెడ్డి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. జీఎస్‌రెడ్డి సేవలకు గుర్తుగా హుజూర్‌నగర్ ప్రధాన రహదారిపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

నిజాయితీకి నిలువుటద్దం జీఎస్‌రెడ్డి