
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
సంస్థాన్ నారాయణపురం: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన సోమవారం సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు అందోజు బీష్మా( రాజుచారి) తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టపాక గ్రామంలోని బంధువులు ఇంట్లో శుభకార్యం ఉండడంతో బీష్మా( రాజుచారి) కుంటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రాత్రి సమయంలో దుండగులు గేట్ తాళం పగులగొట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ తాళం రాలేదు. దీంతో ఇంటి పక్కన సందులో నుంచి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి ప్రధాన ద్వారం తాళం తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తాళం పగులగొట్టకుండా స్క్రూలు తొలగించారు. బీరువాలోని 12 తులాలు బంగారు వస్తువులు (చైన్‌లు, రింగ్‌లు, ఇతర వస్తువులు), అరకేజీ వెండి వస్తువులు, రూ.1.50 లక్షల నగదు చోరీ చేశారు. బీరువాలోని వస్తువులను చిందరవందరగా పడవేశారు. సోమవారం బీష్మా ఇంటికి వచ్చేసరికి గేట్ తాళం వంగి ఉండడం, ప్రధాన ఇంటి ద్వారం తాళం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, ఎస్‌ఐ జగన్ పరిశీలించారు. క్లూస్ టీం క్లూస్‌తో వివరాలు సేకరించినారు. గ్రామంలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.