
నిజాయితీ చాటుకున్న ఆరీ్టసీ సిబ్బంది
నకిరేకల్ : ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ప్రయాణికులు పోగొట్టుకున్న లక్ష రూపాయల నగదు ఉన్న బ్యాగును తిరిగి ప్రయాణికులకు అప్పగించారు. వివరాలు.. కోదాడ ప్రాంతం నుంచి ఇద్దరు మహిళా ప్రయాణికులు నకిరేకల్‌కు వస్తున్నారు. సూర్యాపేట వరకు వచ్చాక సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్‌లో నల్లగొండకు వెళుతున్న టీఎస్ 4064 నంబర్ గల బస్సును సోమవారం మధ్యాహ్నం ఎక్కారు. ఈ క్రమంలో తమ సీటులో లక్ష రూపాయలు నగదు ఉన్న బ్యాగ్, మరో చేయి సంచిని సీటులో పెట్టి అత్యవసరంగా బస్సు దిగారు. అనంతరం ఆ ఇద్దరు ప్రయాణికులు తిరిగి బస్ కోసం రాగా అప్పటికే వెళ్లిపోయంది. సదరు ప్రయాణికులు అక్కడే బస్టాండ్‌లో ఉన్న కంట్రోలర్‌కు సమాచారం అందజేశారు. ఆయన ఫోన్ ద్వారా నకిరేకల్‌లో ఉన్న ఆర్టీసీ కంట్రోలర్ మన్నాన్‌కు సమాచారం అందించారు. నకిరేకల్ కంట్రోలర్ మన్నాన్.. కండక్టర్ నకిరేకల్ వాసి నోముల సత్తయ్యకు ఫోన్ చేసి ప్రయాణికులు బస్సు సీటులో ఉంచిన బ్యాగ్‌ను భద్రపరచమని సమాచారం అందించారు. బ్యాగ్ మిస్ అయిన ప్రయాణికులు కూడా నకిరేకల్‌లో ఉంటున్న వారి బంధువులకు సమాచారం అందించారు. కండక్టర్ సత్తయ్య బ్యాగ్‌ను భద్రపరిచి పోగొట్టుకున్న వారి బంధువులకు నకిరేకల్‌లో అప్పగించారు. బ్యాగ్ మిస్ అయినవారు నకిరేకల్‌కు మరో బస్‌లో వచ్చి తీసుకున్నారు.