
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
సూర్యాపేట: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని భారత క్రికెట్ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఎస్‌కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో పది రోజుల పాటు నిర్వహించిన ఎంఎస్‌కే ఐసీఏ అండర్–16 క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన వారికి ఆదివారం రాత్రి ఆయన బహుమతులు అందజేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు టోర్నమెంట్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం కల్గుతాయన్నారు. ఈ టోర్నమెంట్‌లో ఫ్రీడమ్ క్రికెట్ అకాడమీ, నల్లగొండ వారికి ప్రథమ బహుమతి లభించగా.. ఎంఎస్‌కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, సూర్యాపేట వారు ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత నాగపురి రమేష్, నల్లగొండ జిల్లా సెక్రటరీ సయ్యద్ అమీబాబా, డాక్టర్ సందీప్, మున్సిపల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్ భరత్, హెడ్ కోచ్ ఉస్మద్ తదితరులు పాల్గొన్నారు.
భారత క్రికెట్ మాజీ చీఫ్ సెలెక్టర్
ఎంఎస్‌కే ప్రసాద్