ఏదుళ్లగూడెంలో మద్యం అమ్మకాలపై నిషేధం | - | Sakshi
Sakshi News home page

ఏదుళ్లగూడెంలో మద్యం అమ్మకాలపై నిషేధం

Oct 6 2025 6:33 AM | Updated on Oct 6 2025 6:33 AM

ఏదుళ్లగూడెంలో మద్యం  అమ్మకాలపై నిషేధం

ఏదుళ్లగూడెంలో మద్యం అమ్మకాలపై నిషేధం

తీర్మానం చేసిన గ్రామస్తులు

వలిగొండ : వలిగొండ మండల పరిధిలోని ఏదుళ్లగూడెం గ్రామంలో బెల్టుషాపుల్లో మద్యం విక్రయించొద్దని ఆదివారం గ్రామస్తులు తీర్మానం చేశారు. తీర్మానానికి వ్యతిరేకంగా ఎవరైనా మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా విధించి.. ఆ డబ్బును గ్రామ అభివృద్ధికి కేటాయిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎవరైనా మద్యం అమ్మినట్లు సమాచారం ఇస్తే రూ.10వేల నజరానా అందిస్తామని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గూడూరు వెంకట్‌రెడ్డి, ఏనుగు సత్తిరెడ్డి, ఏనుగు వెంకట్‌రెడ్డి, గూడూరు నర్సిరెడ్డి, ఏనుగు యాదిరెడ్డి, కప్పల భిక్షపతి, కుకుంట్ల కిష్టయ్య, నోముల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మూసీకి పోటెత్తిన వరద

భూదాన్‌పోచంపల్లి: హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు వరద మూసీ నదిలోకి వచ్చి చేరుతుండటంతో ఆదివారం తెల్లవారుజామున నుంచి మళ్లీ వరద పోటెత్తింది. దీంతో భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్యన లోలెవల్‌ బ్రిడ్జి పైనుంచి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ మార్గం గుండా పోచంపల్లి నుంచి బీబీనగర్‌కు రాకపోకలను నిలిపివేశారు. భువనగిరి నుంచి పోచంపల్లికి వచ్చే ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా రద్దు చేశారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బాలుడిని కాపాడబోయి మహిళ మృతి

రామగిరి(నల్లగొండ): కాలువలో పడిన బాలుడిని కాపాడబోయి మహిళ మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని కతాల్‌గూడకు చెందిన పగడాల అంజలి(28) బట్టలు ఉతికేందుకు కొత్తపల్లి గ్రామ శివారులోని ఎస్‌ఎల్‌బీసీ కాలువ వద్దకు వెళ్లింది. అదే సమయంలో ఈత కొట్టేందుకు కాలువ వద్దకు వచ్చిన జిల్లేపల్లి దీక్షిత్‌ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు అంజలి నీటిలోకి వెళ్లింది. దీక్షిత్‌ను అక్కడే ఉన్న నారబోయిన రామకృష్ట రక్షించగా.. అంజలి నీటిలో మునిగిపోయింది. సమీపంలోని బ్రిడ్జి వద్ద అంజలి మృతదేహాన్ని బయటకు తీశారు. మృఉతురాలి భర్త కిరణ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ సైదాబాబు తెలిపారు.

రసాయన వ్యర్థాలు తిని

గొర్రెలు మృతి

చిట్యాల: రసాయన వ్యర్థాలు తిని నాలుగు గొర్రెలు మృతి చెందగా, మరికొన్ని గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామ పరిధిలోని నార గుట్ట సమీపంలో గల భూముల్లో ఇటీవల కొందరు రసాయన వ్యర్థాలతో కూడిన సంచులను వదిలి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన గొర్రెల పెంపకందారుడు మెట్టు లింగయ్యకు చెందిన మూడు గొర్రెలు ఆ రసాయన వ్యర్థాలను తిని శనివారం మృతి చెందగా.. ఆదివారం మరో గొర్రె మృతి చెందింది. మరికొన్ని గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. పశు వైద్యాధికారులకు సమాచారం ఇవ్వడంతో అస్వస్థతకు గురైన గొర్రెలకు చికిత్స చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement