
నీటిసంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి
కనగల్: మండలంలోని పగిడిమర్రి గ్రామంలో పండగ పూట విషాదం నెలకొంది. నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. పగిడిమర్రికి చెందిన ఇటికాల రామలింగం – శ్రీలత కుమారుడు హర్షద్ రామ్(3) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో బొమ్మలతో ఆడుకుంటుండగా బొమ్మ నీటి సంపులో పడింది. దానిని బయటకు తీసే క్రమంలో బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. తల్లిదండ్రులు కొద్దిసేపటి తర్వాత బయటకి రాగా కుమారుడు నీటిసంపులో పడి ఉండటాన్ని గమనించి బయటకు తీశారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
మిర్యాలగూడ అర్బన్: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. టూ టౌన్ ఎస్‌ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్‌చౌక్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న 48 ఏళ్ల వ్యక్తిని గుర్తించిన స్థానికులు 108 అంబులెన్స్ సాయంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. అతడు కొద్ది రోజులుగా పట్టణంలో భిక్షాటన చేస్తూ సంచరిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిస్తే 87126 70150, 99664 98185 నంబర్లను సంప్రదించాలని కోరారు.
6న హెచ్‌ఎండీఏ కార్యాలయం ఎదుట ధర్నా
భువనగిరి: రీజినల్ రింగ్‌రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి ఈ నెల 6న హెచ్‌ఎండీఏ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ కోరారు. శుక్రవారం భువనగిరిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన అలైన్‌మెంట్ కాకుండా 28 కిలోమీటర్లు కుదించడం వల్ల వరి, పత్తి పంటలు పండించే సారవంతమైన భూములు రైతులు కోల్పోతున్నారన్నారు. సాగుకు యోగ్యం కాని భూములు తీసుకోవాలని చట్టం చెబుతున్నా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్న వర్గాలను కాపాడేందుకు అలైన్‌మెంట్ మార్చి రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. కొండమడుగు నర్సింహ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, పెంటయ్య, కృష్ణారెడ్డి, స్వామి, నర్సింహ, చంద్రారెడ్డి, యాదగిరి, యాదిరెడ్డి, జయరాములు పాల్గొన్నారు.

నీటిసంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి

నీటిసంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి