
రోడ్డుకు వేసవిలో శాశ్వత మరమ్మతులు
మోత్కూరు: మొత్కూరు పెద్ద చెరువు (మినీ ట్యాంక్‌బండ్) కట్ట రోడ్డుకు వేసవిలో శాశ్వత మరమ్మతులు చేపడుతామని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ రమేష్‌బాబు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో కుంగిన చెరువు కట్టకు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినా మళ్లీ కుంగడంతో బుధవారం ఈఈ సత్యనారాయణగౌడ్‌తో కలిసి పరిశీలించారు. కట్ట అడుగు భాగాన బుంగపడటం లేదా, ఆ స్థలంలో పాడుబడిన బావి ఉండటం గాని, కొత్త, పాత కట్ట నిర్మాణాలు బలోపేతంగా లేకపోవడం వల్ల కట్టపై రోడ్డు కుంగి, పగుళ్లు వస్తుండవచ్చని అభిప్రాయపడ్డారు. చెరువులో నిండుగా నీరు ఉండటం వల్ల మరమ్మతులు చేపట్టలేమన్నారు. వేసవిలో శాశ్వత మరమ్మతులు చేపడతామని తెలిపారు. అప్పటి వరకు వాహనాలను దారి మళ్లిస్తూ కుంగిన చోట భద్రత దృష్ట్యా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై పోలీసులు, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట ఏఈలు అఖిల్, చంద్రశేఖర్, విక్రమ్ ఉన్నారు.
ఫ ఇరిగేషన్ సీఈ రమేష్‌బాబు