
వే బ్రిడ్జి సీజ్
మోత్కూరు: మోత్కూరు మండలం అనాజిపురంలోని కంఠ్ల మహేశ్వర స్వామి వే బ్రిడ్జి మోసాలపై ఇటీవల రైతులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు సాక్షి దిన పత్రిక ఈ నెల 26న ‘తూకం తప్పుతున్న ధర్మకాంట’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనానికి జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారులు స్పందించారు. సోమవారం జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారి కందగట్ల వెంకటేశ్వర్లు వే బ్రిడ్జిని తనిఖీ చేశారు. తూకంలో 30 కిలోల తేడా చూపిస్తుండడంతో వే బ్రిడ్జిని సీజ్ చేసినట్లు తెలిపారు. జరిమానా విధిస్తామని తెలిపారు. వే బ్రిడ్జిని నిర్వహించొద్దని యాజమానిని ఆదేశించారు. అనంతరం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పలు దుస్తుల దుకాణాలతో పాటు ఇతర దుకాణాలను తనిఖీ చేశారు. లీగల్ మెట్రోలజీ శాఖ నుంచి ధ్రువపత్రం విధిగా పొందాలని, లేకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.