
వెలవెలబోతున్న రైతుబజార్
భువనగిరి: భువనగిరి పట్టణంలోని రైతు బజార్‌కు హైదరాబాద్ నుంచి కూరగాయలను సరఫరా చేసే వ్యాపారులు గిట్టుబాటు అయ్యే విధంగా ధరలు నిర్ణయించడం లేదని కూరగాయల సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో కూరగాయల దిగుమతి నిలిపివేత మూడో రోజు సోమవారం కూడా కొనసాగింది. రైతు బజార్‌లో కూరగాయలు లేకపోవడంతో వెలవెలబోయింది. సోమవారం వ్యాపారులు, విక్రయదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ సమస్య అదే విధంగా ఉండిపోయింది.
అధిక ధరలకు విక్రయాలు
గత మూడు రోజులుగా రైతు బజార్‌కు కూరగాయలు దిగుమతి కావడం లేదు. దీంతో ధరల నిర్ణయం కూడా జరగడం లేదు. ప్రస్తుతం రైతు బజార్‌లో కొద్ది మంది విక్రయదారులు పరిసర ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకువచ్చే రైతుల నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. ఈ కూరగాయలు సరిపడా రాకపోవడంతో కొంతమంది విక్రయదారుల వద్ద ఉన్న కూరగాయలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని రైతు బజార్‌లో రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా విక్రయిస్తున్నారు.
మూడోరోజూ కొనసాగిన
కూరగాయల దిగుమతి నిలిపివేత
పరిసర ప్రాంతాల రైతుల నుంచి
కొనుగోలు చేస్తున్న విక్రయదారులు
వినియోగదారులకు
అధిక ధరలకు విక్రయం
ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు
రైతు బజార్‌లో కూరగాయలు లభించడం లేదు. సుమారు 20 కిలో మీటర్ల దూరం నుంచి కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చాను. రైతు బజార్‌లో తక్కువ ధరలకు కాకుండా నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా డబ్బులు తీసుకుంటున్నారు. టమాటకు అదనం రూ. 5లు తీసుకుంటున్నారు.
– గౌరి, చీకటిమామిడి

వెలవెలబోతున్న రైతుబజార్