
నేడు భువనగిరిలో సద్దుల బతుకమ్మ వేడుకలు
భువనగిరి: భువనగిరి పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు మంగళవారం నిర్వహించనున్నారు. ఈమేరకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భువనగిరి పెద్ద చెరువు వద్ద ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టనున్నారు. బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు చెరువు వద్ద ఏర్పాట్లు చేశారు.
వయో వృద్ధుల ఆశ్రమంలో వసతుల పరిశీలన
భువనగిరి: మండలంలోని చీమలకొండూరు గ్రామంలో జేఎంజే వమోవృద్ధుల ఆశ్రమాన్ని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మాధవీలత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో కల్పిస్తున్న వసతులను వయో వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వాహకులకు సూచించారు.
మినీ శిల్పారామంలో
దసరా సంబురాలు
భువనగిరి: దసరా సంబురాల్లో భాగంగా భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలోని మినీ శిల్పారామంలో సోమవారం వరంగల్‌కు చెందిన నృత్యకళాకారులు కూచిపూడి నృత్య కళా ప్రదర్శన చేశారు. నృత్య స్రవంతి కూచిపూడి కళా క్షేత్రం నాట్య గురువు రేణుక, కళాకారులు సుదీప్తి, అనిషా, శరణ్య, వైష్ణవి,
రిషిక, లాస్య సహస్ర తదితరులు పాల్గొన్నారు.
మద్యం దుకాణాల
టెండర్లకు 23 దరఖాస్తులు
భువనగిరి: జిల్లాలో మద్యం దుకాణాల కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో ఉన్న మొత్తం 82 దుకాణాలకు గాను ఈ నెల 26వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రారంభమైంది. సోమవారం 11 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు మొత్తం 23 దరఖాస్తులు వచ్చాయి. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు తుదిగడువు ఉంది.