
కూరగాయలకు కటకట
భువనగిరి: బతుకమ్మ, దసరా పండుగల వేళ.. కూరగాయలకు కొరత ఏర్పడింది. భువనగిరిలోని రైతుబజార్‌కు రోజులుగా దిగుమతి నిలిచిపోవడంతో మూడు రోజులుగా స్టాళ్లు మూతపడ్డాయి. ధరల విషయంలో వ్యాపారులు, విక్రయదారులు, రైతుల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలతో ఈ పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారుల జేబు గుల్ల చేస్తున్నారు.
కారణం ఇదీ..
రైతుబజార్‌కు భువనగిరి పరిసర ప్రాంతాల నుంచి బీరకాయ, దోస, కీరదోసతో పాటు మరికొన్ని కూరగాయలు రైతులు తీసుకువస్తున్నారు. వంకాయ, అలుగడ్డ, బెండ, కాకర, పచ్చిమిర్చి, బీన్స్, క్యాబేజీ, దొండ, కాలీప్లవర్, చామగడ్డ, గోకర, క్యాప్సికం, క్యారెట్‌ను హైదరాబాద్ నుంచి వ్యాపారులు వాహనాల ద్వారా రైతుబజార్‌కు సరఫరా చేస్తారు. ఈ కూరగాయల ధరలను ప్రతి రోజూ హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్ కంటే రూ.2నుంచి రూ.4 వరకు అదనగా నిర్ణయిస్తుంటారు. కాగా రైతుబజార్‌లో నిర్ణయిస్తున్న రేట్లు తక్కువగా ఉన్నాయని, తమకు నష్టం కలుగుతుందని భావించి కూరగాయల సరఫరా నిలిపివేశారు. దీనికి తోడు రైతుబజార్‌లోని విక్రయదారులు సైతం ధరల నిర్ణయించే విషయంలో ఎక్కువ వ్యత్యాసం ఉండటంతో తమకు నష్టం ఏర్పడుతుందని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే భువనగిరి పరిసర ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకువచ్చే రైతులు తమ వద్ద రైతుబజార్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల శ్రమకు తగ్గ ఫలితం లేకుండా పోతుందని భావించి నేరుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అటు వ్యాపారులు, ఇటు రైతులు కూరగాయలు తీసుకరాకపోవడంతో రైతుబజార్‌లో చాలావరకు స్టాల్స్‌ను మూసివేశారు.
నిత్యం 2 క్వింటాళ్ల వరకు విక్రయాలు
రైతుబజార్‌లో 120 కూరగాయల స్టాళ్లు, 46 ఆకుకూరల స్టాళ్లు ఉన్నాయి. రోజూ టన్నుల వరకు కూరగాయలు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం బతుకమ్మ పండుగ నేపథ్యంలో కూరగాయలకు డిమాండ్ మరింత పెరిగింది. రైతుబజార్‌కు వచ్చిన వినియోగదారులు తెరిచి ఉన్న కొద్ది స్టాళ్లలో అందుబాటులో ఉన్న కూరగాయలు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు.
ఫ భువనగిరిలోని రైతుబజార్‌కు
నిలిచిన కూరగాయల దిగుమతి
ఫ ధరల విషయంలో వ్యాపారులు, విక్రయదారులు, రైతుల్లో భిన్నాభిప్రాయాలు
ఫ రెండు రోజులుగా మూతబడిన స్టాళ్లు
ఫ పండుగల వేళ
వినియోగదారుల ఇక్కట్లు
ఫ బహిరంగ మార్కెట్‌లో అధిక రేట్లు
సమస్య పరిష్కరిస్తాం
బోయినిపల్లి మార్కెట్‌కు అనుగుణంగా రైతుబజార్‌లో కూరగాయల ధరలు నిర్ణయిస్తుంటారు. రోజూ హెచ్చుతగ్గులు ఉంటాయి. ధరల విషయంలో వ్యాపారులు, విక్రయదారులు, రైతుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. కూరగాయల దిగుమతికి చర్యలు తీసుకుంటాం.
– అఫ్జల్, రైతుబజార్ ఎస్టేట్ అధికారి