
మహిళల ఆరోగ్య శ్రేయస్సుకు ప్రధాని మోదీ కృషి
బీబీనగర్: మహిళల ఆరోగ్య శ్రేయస్సుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్‌ను ప్రవేశపెట్టారని ఎంపీ, ఎయిమ్స్ బోర్డు మెంబర్ డీకే అరుణ అన్నారు. స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్‌లో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. ఎయిమ్స్‌లో అందుతున్న వైద్య సేవలు, వసతుల పట్ల రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంత శాంతసింగ్, డిప్యూటీ డైరెక్టర్ బిపీన్ వర్గీస్‌తో సమావేశమై స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్‌లో భాగంగా కొనసాగుతున్న క్యాంప్‌లు, కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు, ఆమె మాట్లాడుతూ.. స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్‌లో భాగంగా మహిళలకు మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు, ఉచితంగా అనేక రకాల టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. ఎయిమ్స్‌లో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 9,400మంది మహిళలు టెస్టులు చేయించుకున్నారని పేర్కొన్నారు. నిరు పేదలందరికీ మెరుగైన వైద్యం అందించడమే ఎయిమ్స్ లక్ష్యమని, ఆదిశగా ఎయిమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆమె వెంట బీజేపీ నాయకులు వెముల అశోక్, జగన్మోహన్‌రెడ్డి, అశోక్‌గౌడ్, నరోత్తమరెడ్డి, గోపాల్‌రెడ్డి, రవీందర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంపీ డీకే అరుణ