
బ్యాంక్ గ్యారెంటీ, అగ్రిమెంట్లు సమర్పించండి
సాక్షి,యాదాద్రి : రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ, అగ్రిమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలని, లేనిపక్షంలో మిల్లులకు ధాన్యం కేటాయించబడదని అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సివిల్ సప్లై అధికారులు, మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిల్లు సామర్థ్యంలో కనీసం 50 శాతం ధాన్యం తీసుకుని మిల్లింగ్ చేయాల్సి ఉంటుందని, లేకపోతే మిల్లు అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు. 2024–25 వానాకాలం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) డెలివరీ 83 శాతం పూర్తయిందని, మిగిలిన ధాన్యం కూడా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా నాయబ్ తహసీల్దార్లతో సమావేశమై హైకోర్టు, లోకాయుక్త, టీహెచ్‌ఆర్‌సీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్సీ,ఎస్టీ, బీసీ కమిషన్ కేసులు, సీఎం ప్రజావాణి, కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, తదుపరి చర్యలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్‌ఓ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి